ఒకసారి కొత్తగా వచ్చిన ఉన్నతాధికారి ఒకరు
తన శాఖ మంత్రిగారి నివాసానికి వచ్చాడు. ద్వారం దగ్గర అనుమతి తీసుకొని
లోనికి వచ్చాడు. అక్కడ చిన్న తోట ఉంది...అందులో ఒక మనిషి బనియన్,
నిక్కరుతో మొక్కల మధ్య కలుపు తీస్తూ నీళ్ళు పెడుతున్నాడు. ఆ
కొత్త అధికారి అతడిని చూచి, ''ఒరే మాలి! నేను మంత్రిగారిని కలవాలి. వెంటనే
లోనికి వెళ్లి ఈ కార్డు ఇచ్చిరా!'' అంటూ తన పరిచయం గల కార్డిచ్చాడు.
ఆవ్యక్తి అది పుచ్చుకొని మరేం మాట్లాడకుండా లోనికి వెళ్ళాడు పిదప తన ధోవతి,
లాల్చీ ధరించాడు తలపై టోపీ పెట్టుకొన్నాడు. బయటకు వచ్చాడు. ఆ తరువాత ఆ అధికారి వద్దకు వెళ్లి-
'మీరులోనికి రండి . వచ్చి కూర్చోండి, నేనే మీరు కలవాల్సిన మంత్రిని'
అన్నాడు. సాదాసీదాగా ఉన్న అతగాడిని చూసి ఆ కొత్త ఆఫీసరు కంగుతిన్నాడు.
ఇందాక తను చూచిన వ్యక్తే లాల్‌బహదూర్ శాస్త్రి అని పోల్చుకున్నాడు. తన
పొరబాటును క్షమించమని ఎంతగానో వేడుకున్నాడు. అందుకు శాస్త్రీజీ- 'మరేం ఫరవాలేదు. పని
చిన్నది పెద్దది అని వుండదు. చేసే పనిని బట్టి మనుషుల్ని విలువకట్టడం
సరికాదు. మనుషుల్ని మానవతా దృష్టి తో చూడడం నేర్చుకుంటే మంచిది' అంటూ
హితబోధ చేశారు. శాస్త్రిజీ నిరాడంబరజీవి . మానవతా మూర్తి అందుకే అంత
గొప్పవారుగా పేరు పొందారు మరి?ఈ తరం నేతలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది
ఎంతో ఉంది.