Clsr

Recent Posts

స్వామి వివేకానంద

Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

కేవలం ముప్ఫై తొమ్మిదేళ్ళు భూమిపై తిరుగాడినప్పటికీ, నేటికీ సజీవ చైతన్యమూర్తిగా స్ఫూర్తినిస్తున్న వ్యక్తిత్వం ఆ మహాశయునిది. భారతదేశపు హృదయం స్వామీ వివేకానంద. 1893 లో విదేశాలకు భారతీయ వైభవాన్ని తెలియజెప్పడమే కాక,భారతీయులకు స్వాభిమానాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, దేశభక్తినీ కలిగించిన మహాత్ములాయన. వారి వాక్కు వ్యక్తిత్వం నిజమైన స్వాతంత్ర్యోద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. వారు భారతదేశపు మహోజ్జ్వల గతచరిత్రనీ, పరాయిదాడులచే తేజస్సు తరిగిన తన కాలపునాటి వర్తమానాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. శాస్త్రాలను చదివి, గురువుద్వారా అనుభవజ్ఞానాన్ని పొంది, దేశవిదేశాలను పరిశీలనాత్మక దృష్టితో పర్యటించి - అన్నిటినీ అవగాహన చేసుకొని, అద్భుతమైన బోధనలను అందించారు.
మాటలతో పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే దేశంపట్ల బాధ్యతాయుతమైన గౌరవాన్ని ప్రకటిస్తూ సేవనందించారు. దేశం సాంకేతికంగా, వైజ్ఞానికంగా ఎదగాల్సిన అవసరాన్ని గుర్తించి, దానికిగానూ ఎందరికో స్ఫూర్తినిచ్చారు.
భౌతికంగా, బౌద్ధికంగా దేశం ఎదగాలి - అని ఆశించారు. అది ఆశయంగా మాత్రమే మిగలకుండా, ఏవిధంగా ఆచరణలోకి తేవాలో ప్రణాళికాబద్ధంగా నిర్దేశించారు. ఈ దేశ పునర్నిర్మాణంలో - దీని స్వాభావిక ఆర్షసంస్కృతి, ధార్మిక స్ఫూర్తి పునాదులని ప్రగాఢంగా భావించి విశదపరచారు. ’హిందూమతం’ అని చెప్పబడుతున్న ఈ దేశపు స్వాభావిక (Native) ప్రాచీన జీవన విధానం, విజ్ఞాన కళాసంపత్తి, ఆదర్శాలు ఏమరకుండా, వాటి ఆధారంగానే దేశపురోగతిని సాధించగలము. - అని సహేతుకంగా తేటపరిచారు.
అప్పటికి కొద్ది శతాబ్దాలుగా బహుసంఖ్యాక ప్రజలు, స్త్రీలు వెనుకబడి ఉన్నారని గమనించి, వారిని నిర్లక్ష్య పరచరాదని, దేశాభ్యుదయం వారికి చేరి దేశప్రగతిలో వారు ప్రధానం కావాలని ప్రబోధించారు. "మనలో సంస్కరించుకోవలసిన అంశాలు ఉన్నమాట వాస్తవమే. ఆస్థితి ప్రతి దేశానికీ, ప్రతి సమాజానికీ ఉంటుంది. ఆమాటకొస్తే - మనదేశం, మిగిలిన వాటితో పోలిస్తే చాలా మెరుగైనది..." అని చెప్పిన ఆ మహానుభావులు దేశసమగ్రాభివృద్ధికోసం, నాటి పరాయిపాలనలోనే, దీర్థదృష్టితో అత్యద్భుతమైన, ఆచరణసాధ్యమైన సూచనలు చేశారు. విభాగాలపై కాకుండా సమగ్రతపైనే వారి దృష్టి. ఇప్పుడు దేశానికి ఇది అత్యావశ్యకం.
విచారకరమైన విషయమేమిటంటే - స్వాతంత్ర్య సిద్ధి కాలంలోనూ, అటుపై ఇన్ని పదుల ఏళ్ళలోనూ ఆ మహనీయుని ఆదర్శాలను పరిగణించని పాలనా పద్ధతులే నడుస్తున్నాయి. రాక్షస రాజకీయ కాలుష్య ప్రభావం చేత ఈ దేశపు భవ్యాదర్శాలన్నీ మంటగలుస్తున్నాయి. విదేశీ మత విస్తరణ వాదుల దుర్మార్గం వల్ల ఈ దేశం సమైక్యస్థితిని సాధించే బదులు, మరిన్ని క్చీలికలకు గురౌతోంది. కులవైషమ్యాలు పెచ్చుపెరిగి, జాతీయభావాలని దెబ్బతీస్తున్నాయి. ఈదేశ ధర్మాలపై, సంస్కృతిపై అవగాహన లేనివారు, తమ పదవులకోసం ఈ ధర్మసంస్కృతిని దెబ్బతీస్తున్నారు. పాశ్చాత్యపాలనలో లేని దిగజారుడునం ఇప్పుడు దేశమంతా కనిపిస్తోంది.
స్వాతంత్ర్య సిద్ధినుండి చట్టాలు, మనుషులు కూడా అగ్ర, అడుగు వర్గాలకోసం ఎన్నో ఆసరాలను కల్పిస్తూ, ఎదగనిస్తున్నా - విదేశీ మత స్వార్థపరులవల్ల, ఓట్లకోసం దేనికైనా తెగిస్తున్న పాలకులవల్ల ’అణిచివేయబడిన వర్గం’ అలాగే ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. మరోవైపు దేశవాసులు, సంస్కృతిప్రియులు మొదటినుండి సమైక్యత కోసం శ్రమిస్తుంటే దానిని కుదరనివ్వకుండా విభేదాలను కొనసాగిస్తూ పరస్పర విద్వేష వైషమ్యాలను సృష్టిస్తున్నారు రాజకీయులు. ప్రజల్లో స్ఫూర్తి సన్నగిల్లుతోంది. ఒక స్తబ్ధత, ఉదాసీనత, వ్యామోహం, సుఖలాలస పెరిగాయి. వివేకానంద మార్గానికి విరుద్ధమైన మతాంతరీకరణలు దేశసమగ్రతను దెబ్బతీస్తున్నాయి.
ఇలాంటి దశలో ఈ వివేకానంద జయన్త్యుత్సవాలువచ్చాయి. దీనిని ఆలంబనగా తీసుకొని వ్యక్తిత్వ నిర్మాణాన్ని సాధించే విద్య, శ్రేయస్కర పాలన, సామాజికాభివృద్ధి, సాంకేతిక ప్రగతి, సమత్వం - వాటిని ఈ దేశపు సనాతన ధార్మిక విలువల ఆధారంగా ఏ విధంగా సాధించాలి?...అనే అంశంపై దేశీయులంతా ఆలోచించాలి.
"మరో 1500 ఏళ్ళకు సరిపడే ఆహారాన్ని అందించాను" అన్న వివేకానంద వాక్కుప్రకారం దేశ పునర్నిర్మాణానికి కావలసిన పాఠాలన్నీ వారి వాక్కుల్లో మనకు దొరుకుతాయి. వాటిని అందిపుచ్చుకొని ఆ యతిరాట్టు నిర్దేశించిన అద్భుత భారతిని ఆవిష్కరించేందుకై అందరం కృషి చేద్దాం.