Clsr

Recent Posts

కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు


బంగారు తెలంగాణా లక్ష్యంతో కోటి రతనాల వీణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్ తొలి సంతకం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా పదిహేను వేల కోట్లు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే తొలి సంతకం ఇదే ఫైలుపై చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారులు ఏకే గోయెల్, రేవీ రమణాచారి, రామచంద్రుడు, రామ్ లక్ష్మణ్ తదితరులు రైతు రుణ మాఫీ ఫైలును సిద్ధం చేస్తున్నారు. దీన్ని తెలంగాణా అధికార యంత్రాంగం ఫైనల్ చేసి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజుకు ఆయన ముందు పెట్టబోతోంది. ప్రస్తుతం తెలంగాణాలో వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు  24 వేల కోట్లకు పైమాటే. ఇందులో లక్షల రూపాయల లోపు రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేయనుంది. దీంతో 22  వేల మంది అన్నదాతలు లాభపడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతు రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయబోతున్నారు. తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్ హామీ అమల్లోకి వచ్చింది. ఇలా తొలి సంతకం హామీలు మన నేతల్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తున్నాయి.