Clsr

Recent Posts

How To Have A Successful Job Interview ?

  ఇంటర్వ్యూ లో విజయం సాధించడం ఎలా?



ఉద్యోగానికి ఎన్నిక కావాలంటే పూర్వంలా ఇంటర్వ్యూలే కాక, అంతకు ముందుగా రాత పరీక్షలు కూడా ఉంటాయి. కొన్ని సంస్థల్లో రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే కాల్‌ లెటర్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఆ సంస్థ పట్ల, తాము ఉద్యోగం చేయవలసిన పనిపట్ల సరైన అవగాహన ఉండాలి. ఇంటర్వ్యూ అంటే బెదిరిపోకూడదు. తమకు ఆ ఉద్యోగం వస్తుందో, రాదో అన్న సందేహం లేకుండా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, ఇంటర్వ్యూ చేసే వారి ఎదుట హాజరవ్వాలి. ఇంటర్వ్యూ చేసేవారు వారి లౌకికజ్ఞానాన్నీ, తెలివితేటలనూ, మెదడు చురుకుదనాన్నీ పరిశీలిస్తారు.

 ఉద్యోగులను ఎన్నుకోబోయే ముందు, వారు ఆ పదవికి తగినవారా, కాదా అన్న వారికి ఆ అర్హత ఉందా అన్న విషయాన్ని వారి దరఖాస్తు ద్వారా తెలుసుకుంటారు. ఆ అభ్యర్థిని ప్రశ్నల ద్వారా పరీక్షించి, వారి నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని, వారిలో అంకితభావం ఉన్నదా లేదా అని వారి ప్రవర్తన ద్వారా, మేనరిజం ద్వారా, మాటల ద్వారా పసిగట్టగలుగుతారు. ఆ ప్రయత్నమే సంస్థ అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అన్నది అభ్యర్థి మానసిక స్థితికి ఓ పరీక్ష. అతని వ్యక్తిత్వానికీ, ఆత్మ విశ్వాసానికీ పరిశీలన.

ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థిని ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు ఎన్నో విషయాల గురించి ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలు ఆ వ్యక్తిని తికమక పెట్టడానికీ, కలవరానికీ, సందేహానికీ, పిరికితనా నికీ గురి చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రం కాదు. అవతలవారు తగిన సమాధానాలను చెప్పి తమ నైపుణ్యాన్ని, తనకు ఆ విషయం పట్ల ఉన్న అవగాహనను నిరూపించుకోవాలన్నదే, ఆ అధికారుల ఉద్దేశమని ఆ అభ్యర్థి తెలుసుకోవాలి.

  • ఇంటర్వ్యూ చేసే వారు అడిగిన ప్రశ్నలకు తడబడకుండా సమా ధానం చెప్పగలగాలి.
  • వారు అడిగిన ప్రశ్న సరిగ్గా అర్థం కాకపోతే, ఆ ప్రశ్నను మరోసారి రిపీట్‌ చేయాల్సిందని కోరవచ్చు. 
  • తెలియని విషయాలను గురించి తెలిసి నట్లుగా మాట్లాడకూడదు.
  • ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్థులు ఓపికగా, తమకు పిలుపు వచ్చేంత వరకూ నిరీక్షించాలి.
  • ఇన్ని గంటలు ఎదురుచూడాలా అని ముఖం చిట్లించుకుంటూ, విసుక్కోకూడదు. 
  • సమయ స్ఫూర్తితో మాట్లాడడం, ఓర్పుతో, చిరునవ్వుతో మృదువుగా ప్రవర్తించడం అవసరం.
  • ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళగానే, అక్కడున్న వారిని మొదటగా విష్‌ చేయాలి. 
  • తమంతట తామే కుర్చీలో కూర్చో కూడదు. వారు కూర్చోమన్న తర్వాతనే కూర్చోవాలి. వారందరినీ కలుసుకున్నం దుకు సంతోషాన్ని వ్యక్తపరచాలి. టేబుల్‌ మీదున్న వస్తువులను కానీ, పేపర్‌ వెయిట్‌ను కానీ కదిలించకూడదు.
  • అభ్యర్థి ధరించిన దుస్తుల తీరును కూడా అక్కడున్న అధికారులు పరిశీలి స్తారు. వాతావరణానికి తగ్గ దుస్తులు ధరించాలి. ముఖానికి, పర్సనాలిటీకీ నప్పేలా హెయిర్‌స్టయిల్‌ ఉండాలి. 
  • ఎదుటివారు ప్రశ్నలడుగుతున్నా, మాట్లాడు తున్నా వారు చెప్పేదేమిటో సాంతం వినాలి, మధ్యలో అడ్డుతగలకూడదు. ఇటూ అటూ దిక్కులు చూడ కూడదు. వారి వైపే చిరునవ్వుతో చూస్తూ, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, ఆ విషయాల పట్ల తమ ఆసక్తిని, తమ ముఖకవళికల ద్వారా వ్యక్తపరచాలి. 
  • ఇంటర్వ్యూ చేయడమన్నది అభ్యర్థులకు ఆ ఉద్యోగం పట్ల ఆసక్తిని, వారి అర్హతను, వారికి ఆ ఉద్యోగం లభిస్తే, సంస్థలో అంకిత భావంతో, బాధ్యతగా పనిచేస్తారా అని తెలుసుకోవడానికి! అధికారులు ప్రశ్నలు గుప్పిస్తూ వారి బాడీ లాంగ్వేజీ, మానరిజం, ఉపయోగించే భాష, వారి వ్యక్తిత్వాన్ని గ్రహించేస్తారు. ఆ ఉద్యోగానికి వారిని అర్హులుగా భావిస్తే, తమ ఆఫీసులో వారు చక్కగా ఉపయోగిస్తారన్న నమ్మకం కలిగితే, వారు ఆ ఇంటర్వ్యూలో విజయం పొంది ఉద్యోగాన్ని సంపాదించుకో గలుగుతారు. అందువల్ల, ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు పాజిటివ్‌ థింకింగ్‌తో, ఆశాభావంతో, నమ్మకంతో ముందడుగు వేయాలి.