ఏటా 10 లక్షలమంది ప్రాణాలు తీసుకుంటున్నారా??నిజమేనా ??అవును..... నిజమే!
పరీక్షలో ఫెయిల్.. ప్రేమ వైఫల్యం.. ఆర్థిక కష్టాలు.. అప్పుల బాధలు.. క్షణికావేశం.. కారణాలేవైతేనేం ఏటా ప్రపంచవ్యాప్తంగా 10లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు! సగటున ప్రతి 40 సెకన్లకు ఒకరు ఉసురు తీసుకుంటున్నారు!! సాదాసీదా అధ్యయన ఫలితాలు కావివి.. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన గణాంకాలు!!.
కడుపు నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య..! పరీక్షలో తప్పినందుకు రైలుకింద పడి యువకుడి మృతి! భర్త వేధింపులతో ఉరేసుకున్న మహిళ!! ఇలా చెబుతూపోతే ఈ చిట్టా చాంతాడంత. పొద్దున లేస్తే వార్తామాధ్యమాల్లో ఇలాంటివెన్నో వార్తలు! ఒక ఊరిలోనే ఇన్ని బలవంతపు మరణాలు నమోదైతే.. మరి జిల్లాలో.. రాష్ట్రంలో.. దేశంలో.. ప్రపంచంలోని దేశాల్లో... రోజుకు ఎన్ని ఆత్మహత్యలు నమోదై ఉండాలి! ఇలాంటివి లెక్కగట్టేందుకు నడుం బిగించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) విస్తుపోయే వాస్తవాలతో ఆ మధ్య ఒక నివేదిక ప్రకటించింది. ఈ బలవన్మరణాలపై అత్యవసర చర్యలు అవసరమని ప్రపంచదేశాలకు సూచించింది. ఆత్మహత్యల నివారణ చాలా సులభమని.. వ్యక్తుల ఆరోగ్య, సామాజిక సమస్యలను తొలగించడానికి తగిన మానవ, ఆర్థిక వనరులను నియోగించడం ద్వారా ప్రభుత్వాలు ఇందుకు కృషి చేయాలని పేర్కొంది. ఈ నివేదిక రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ సక్సేనా మాటల ప్రకారం... ప్రపంచంలో ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆత్మహత్యల రేటు చాలారెట్లు పెరిగింది. కొన్నిదేశాల్లో 60 శాతానికి పెరిగిందని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. నిజానికి ఆత్మహత్య మహాపాపం అని అన్ని మతగ్రంథాలూ చెబుతున్నాయి. కానీ, బలవంతపు మరణాల సంఖ్య ఏటికేడాది ఆందోళనకర స్థాయిలో పెరుగుతూనే ఉంది. ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలే నిదర్శనం. ఆ నివేదిక ప్రకారం..కిందటి సంవత్సరం నమోదైన ఆత్మహత్యల సంఖ్య.. హత్యల కారణంగా, యుద్ధాల్లోను చనిపోయినవారి సంఖ్య కన్నా అధికం. ఇవి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్న వారి వివరాలు మాత్రమే! ఏటా ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యా యత్నాలు చేసేవారి సంఖ్య.. ఇందుకు 20 రెట్లు అధికం!! ఆ నివేదికలోని మరికొన్ని అంశాలు... + ప్రపంచ జనాభాలో ఐదు శాతం తమ జీవితంలో ఒక్కసారైనా ఆత్మహత్యాయత్నం చేసి ఉంటారు. ప్రాణాలు తీసుకోవాలనే భావన 10 నుంచి 14 శాతం మందిలో ఉంటుందని అంచనా. + అంతర్జాతీయంగా యువత ప్రాణాలు పోవడానికి ఎక్కువగా కారణమవుతున్నది ఆత్మహత్యలే. 15-19 ఏళ్ల మధ్య ఉన్నవారిలో ఏటా లక్ష మంది.. క్షణికావేశంలో తమ ప్రాణాలు తామే తీసుకుంటున్నారు. + ఆత్మహత్యల గణాంకాలు ఉన్నా.. అవి కచ్చితం కావు. ఎందుకంటే.. రికార్డుల్లో నమోదు కాని బలవంతపు మరణాలు చాలానే ఉంటాయి. ఆత్మహత్య చేసుకోవడం తప్పు, అసమర్థత అనే భావన చాలామందికి ఉండటం వల్ల.. ఇంట్లో ఎవరైనా అలా చనిపోయినా బయటకు చెప్పకపోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. + ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో మహిళలతో పోలిస్తే మగవారి సంఖ్య మూడు రెట్లు అధికం. అదే సమయంలో ఆత్మహత్యాయత్నాలు చేసేవారిలో పురుషులకన్నా స్త్రీల సంఖ్య మూడు రెట్లు అధికం. చనిపోవడానికి ఎంచుకునే మార్గాలు, చావాలనే భావనలో తీవ్రత పురుషుల్లో ఎక్కువగా ఉండటమే వారి ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటానికి కారణం. + సూసైడ్ మరణాలు అత్యధికంగా.. లిథువేనియా, రష్యన్ ఫెడరేషన్ లాంటి తూర్పు ఐరోపా దేశాల్లో నమోదవుతున్నాయి. పెరూ, మెక్సికో, బ్రెజిల్ తదితర మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లో బలవన్మరణాలు అత్యంత స్వల్పం. ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో చాలా దేశాల గణాంకాలు లభ్యం కాలేదని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది. + ఇక.. అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు, ఆసియా ఖండాల్లో ఆత్మహత్యల రేటు మధ్యస్థంగా ఉంది. + గతంలో ఆత్మహత్యాయత్నం చేసినవారు.. మరోసారి అదే ప్రయత్నం చేసే ప్రమాదం 30-40 శాతం అధికం. అలాగే మానసిక వ్యాధులతో బాధపడేవారు, కుంగుబాటుకు, తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు, శారీరకంగా తట్టుకోలేని నొప్పితో బాధపడేవారిలో.. ఆత్మహత్యా భావన ఎక్కువ. + 75 ఏళ్లు దాటినవారిలో ఆత్మహత్యల రేటు చాలా ఎక్కువ. ఆత్మహత్యకు వారు ఎంచుకునే మార్గం కూడా ప్రాణాలను కచ్చితంగా తీసేదే అయి ఉంటుంది. ఆ యత్నంలో అయ్యే శారీరక గాయాలు, తదుపరి పరిణామాలను తట్టుకుని వారు జీవించడం దాదాపు అసాధ్యం. ఇక ఇలాంటి మరణాలను నివారించేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి.ప్రజల్లో ఆత్మహత్య ల గురించి అవేర్నెస్ కలగచేయాలి. అక్కడక్కడ కొన్ని సంస్థలు పనిచేస్తున్నా వాటి వివరాలు అందరికి తెలియవు.కొన్ని సంస్థలు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నాయి.అలాంటి సమాచారాన్ని మన బ్లాగ్స్ ద్వారా పంచుకోవచ్చు.సూసైడ్ మరణాలను నివారించడంలో మన వంతు పాత్ర నిర్వహిద్దాం.