అరసవల్లి ఆదిత్యుడిని భానుడి లేలేత కిరణాలు
నేరుగా తాకే అద్భుతం మరోమారు ఆవిష్కృతం కానుంది.అక్టోబర్ నెల 1,2,3
తేదీల్లో ఈ అరుదైన దృశ్యం భక్తులను కనువిందు చేయనుంది. ఉత్తరాయణ, దక్షిణాయన
పుణ్యదినాల్లో ప్రతీ ఏటా మార్చి 9,10,11, అక్టోబర్ 1,2,3 తేదీల్లో భానుడి
తొలికిరణాలు అరసవల్లి ధృవమూర్తిని స్పర్శిస్తాయి. స్వామి పాదపద్మాల నుండి
శిరస్సు వరకు అరుణ కిరణాలు తాకే అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు
ఇక్కడకు చేరుకుంటారు. ఆదిత్య మూలవిరాట్‌ను విశ్వకర్మ చెక్కినట్టు
స్థలపురాణంలో ఉంది. కిరణస్పర్శ ఎంతటి మహత్తరమైనదో ఆధ్యాత్మికంగా,
శాస్ర్తియంగా ఎంత ప్రభావితం చూపుతుందో వేదపండితులు చెబుతూనే ఉన్నారు.
వైజయంతీ రథంపై గల శ్రీసూర్యనారాయణుడి సాలగ్రామ ఏకశిలామూర్తి ఐదున్నర అడుగుల
పొడవు, రెండున్నర అడుగుల వెడల్పులో లక్షలాది సాలగ్రామాల మిళితమై ఉంది.
సూర్యరశ్మి తాకిన సమయంలో ఆదిత్యుని మూలవిరాట్‌లో చైతన్యరశ్మి మరింత శక్తిని
పుంజుకుంటుంది.ఉషోదయ కిరణాలతో సమస్త ప్రాణ కోటికి నూతన చైతన్యాన్ని
నింపుతున్న సూర్యభగవానుడు ఆదిత్యునిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం
అరసవల్లి. ఈ ఆలయంలో కొలువుదీరిన భాస్కర స్వామిని పూజించిన వారికి ఈతిబాధలు,
సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం
మండలంలో అరస వల్లి అనే గ్రామంలో ఉంది.
శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామం శ్రీ
సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది.
భాస్కరుణ్ణి
పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ
ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి.
మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉందని
స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ
ప్రవచనం. గంగవంశరాజు గుణశర్మ వారసుడైన కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673
సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని లభించిన శాసనాల ద్వారా
తెలుస్తుంది.
16వ
శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్
ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన
వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర
గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. క్రీ.శ.1778
లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్ ను కనుగోని బయటకి తీసి
ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేసారు. శ్రీ ఉషా,
పద్మినీ, చాయాదేవి, సమేతంగా ఇక్కడ కొలువైన సూర్య నారాయణుడు సకల జీవులకూ
సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదిస్తారని భక్తుల నమ్మిక. స్వామి రెండు
చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. నడుముకు చురిక(కత్తి) ఉంటుంది. ఇక ఆయన
రథానికి సారధి అనూరుడు(అంటే తొడలు లేని వాడు అని అర్ధం) ఈ అనూరుడు
గరుత్మంతుడికి అన్న. ఈయనకే అరుణుడనే మరో పేరుంది). స్వామి విగ్రహానికి ఇరు
పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు.
మామూలు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ ,
కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా
పెరుగుతుంది. అందునా రథ సప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది.
అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా
పిలుస్తారు స్ధానికులు. ప్రత్యేకించి కంటి వ్యాదులు , బొల్లి, కుష్టు,
వ్యాధులతో పాటూ ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత
భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని కొలుస్తారు.వీలుంటే మీరు వెళ్లి స్వామి వారిని చూడండి.