Clsr

Recent Posts

నాణ్యత తగ్గిన వెంకన్న లడ్డు


సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం తిరుపతి లడ్డు అంటే అందరికి ఇష్టమే. తిరుపతి అంటే ముందుగా గుర్తు కొచ్చేది  లడ్డు మాత్రమే. అప్పటి లడ్డు కి ఇప్పటి లడ్డు కి చాలా తేడా ఉంది.తిరుమల వెంకన్నకి  అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం లడ్డు.  భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ  క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు.ఇపుడు ఆ సదుపాయం లేదు. అలాగే లడ్డు లో నాణ్యత కూడా తగ్గిపోయింది.  తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి   దేవస్థానం 16 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నది . ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 5100 లడ్డూలు  తయారుచేయడానికి  ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, ఏలకులు 4 కిలోలు వినియోగిస్తారు. మొత్తం మీద 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.
 కాగా తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
 శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువున్న దీని ధర రూ.25. లడ్డు ధరల్లో అప్పటికి ఇ ప్పటికి చాలా మార్పులొచ్చాయి. 
 ఈ  లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా ఏటా దాదాపుగా పది కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన తిరుమల వెంకన్న లడ్డు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు సాధించింది. చిన్నపుడు ఈ లడ్డు కోసం ఇంట్లో తన్నుకునే వాళ్ళం. తిరుపతిలో ఉద్యోగం చేసినపుడు 
కరువు తీర లడ్లు తిన్నాను. వెంకన్న ఆ అదృష్టం కల్పించాడు.