Clsr

Recent Posts

ఆయనే ఈయన !



ఒకసారి కొత్తగా వచ్చిన ఉన్నతాధికారి ఒకరు తన శాఖ మంత్రిగారి నివాసానికి వచ్చాడు. ద్వారం దగ్గర అనుమతి తీసుకొని లోనికి వచ్చాడు. అక్కడ  చిన్న తోట ఉంది...అందులో  ఒక మనిషి బనియన్‌, నిక్కరుతో మొక్కల మధ్య కలుపు తీస్తూ  నీళ్ళు పెడుతున్నాడు.
ఆ కొత్త అధికారి అతడిని చూచి, ''ఒరే మాలి! నేను మంత్రిగారిని కలవాలి. వెంటనే లోనికి వెళ్లి ఈ కార్డు ఇచ్చిరా!'' అంటూ తన పరిచయం గల కార్డిచ్చాడు. ఆవ్యక్తి అది పుచ్చుకొని మరేం మాట్లాడకుండా లోనికి వెళ్ళాడు పిదప తన ధోవతి, లాల్చీ ధరించాడు తలపై టోపీ పెట్టుకొన్నాడు. బయటకు వచ్చాడు.
ఆ తరువాత ఆ అధికారి వద్దకు వెళ్లి- 'మీరులోనికి రండి . వచ్చి కూర్చోండి, నేనే మీరు కలవాల్సిన మంత్రిని' అన్నాడు. సాదాసీదాగా ఉన్న అతగాడిని చూసి  ఆ కొత్త ఆఫీసరు కంగుతిన్నాడు. ఇందాక తను చూచిన వ్యక్తే లాల్‌బహదూర్‌ శాస్త్రి అని పోల్చుకున్నాడు. తన పొరబాటును క్షమించమని ఎంతగానో వేడుకున్నాడు.
అందుకు శాస్త్రీజీ- 'మరేం ఫరవాలేదు. పని చిన్నది పెద్దది అని వుండదు. చేసే పనిని బట్టి మనుషుల్ని విలువకట్టడం సరికాదు. మనుషుల్ని మానవతా దృష్టి తో చూడడం నేర్చుకుంటే మంచిది' అంటూ హితబోధ చేశారు. శాస్త్రిజీ  నిరాడంబరజీవి . మానవతా మూర్తి అందుకే అంత గొప్పవారుగా పేరు పొందారు మరి?ఈ తరం నేతలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.