ప్రాణిగ్రహణం తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయని బ్రహ్మచారులను పెళ్లైన మగాళ్లు ఆట పట్టిస్తుంటారు. ఆమాట నిజమే అని దేశంలో మగాళ్ళ చావులు నిరూపిస్తున్నాయి.
మన దేశంలో ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహితుడు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు జాతీయ నేర రికార్డు బ్యూరో(ఎన్ సీఆర్బీ) తాజా గణాంకాలు చెబుతున్నాయి. వివాహిత మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని సమాచారం. 2012లో వివాహిత పురుషులు 64వేల మంది ప్రాణాలు తీసుకోగా, 32 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు.మన దేశంలో పెళ్లయిన మగాళ్ల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి.మహిళల పై జరుగుతున్న గృహహింసను నిరోధించేందుకు ప్రభుత్వం తెచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఎ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతోందనే విమర్శలు కూడా వున్నాయి.. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్ ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు.దీంతో పాటు భార్యల ప్రవర్తన సరిగ్గా లేకపోవడం..అక్రమ సంబంధాల ఊబిలో కూరుకుపోవడం...వంటి కారణాలు కూడా మగాళ్ళ ఆత్మహత్య లకు కారణం అని చెబుతున్నారు.పట్టుదల పంతాలకు పోయి మగాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు.ఆధునిక జీవన శైలి కూడా ఆలుమగల మధ్య అంతరాలను పెంచుతోంది.
ఒక్క పశ్చిమబెంగాల్ లోనే భర్తల ఆత్మహత్యలు గత రెండేళ్లలో 11 శాతం పెరిగాయి. బెంగాల్ లో 498ఎ కింద 1.06 లక్షల కేసులు నమోదు కాగా, 80 వేల మంది భర్తలను అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లో ఇరుకున్నవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అయితే 498ఎ దుర్వినియోగం నిలువరించడం కష్టమైన పని అని పోలీసులు అంటున్నారు. ఆలుమగల అనోన్య దాంపత్యమే దీనికి పరిష్కారమంటున్నారు. కాపురాలు ఏ కలతలు లేకుండా సాఫీగా సాగితే వివాహితుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆత్మ హత్యల గురించి చెప్పుకోవాలంటే దేశం లో సగటున ప్రతీ లక్ష మందికి 11.2 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ప్రతీ గంటకు 15 మంది లేదా రోజుకు 371 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సగటున తీసుకుంటే ఇందులో 242 మంది పురుషులు, 129 మంది మహిళలు ఉంటున్నారు. ఆత్మహత్యల్లో కూడా తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ ముందజలో ఉన్నాయి. చనిపోతున్న వారిలో కూడా 84 శాతం మంది కుటుంబ ఇబ్బందుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళల ఆత్మహత్యలకు వ్యక్తిగత కారణాలతో పాటు, ఎమోషనల్‌గా ఉండడం కూడా ప్రధానం కారణంగా ఉంటోంది. దేశం మొత్తంమీద ఆత్మహత్య చేసుకున్న వారిలో సగం మంది కేవలం ఐదురాష్ట్రాలవారే. ఇందులో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకతోపాటు మహారాష్ట్ర ఉన్నాయి. క్షణికావేశంలో చాలామంది తమ ప్రాణాలను బలవంతంగా తీసుకోవడం శోచనీయం. ఈ పోకడను నిరోధించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.